Showing posts with label Interesting Facts about Mahadevar Athisaya Vinayakar Temple. Show all posts
Showing posts with label Interesting Facts about Mahadevar Athisaya Vinayakar Temple. Show all posts
రంగులు మార్చే వినాయకుడిని చూసారా ?  అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సోషల్ సైట్లలో కూడా  అవును నిజమే అంటూ కధనాలు  వస్తున్నాయి.  వినడానికి విచిత్రం గా ఉన్నా నిజం గా రంగులు మార్చే వినాయకుడి ఆలయం తమిళనాడు లోని  నాగర్‌కోయిల్ జిల్లా  కేరళపురం గ్రామంలో ఉందట.

  1.  ఈ వినాయకుడి విగ్రహం  రంగు ఆరు నెలలకు ఒకసారి మారుతుందట. ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు.

 2.   దక్షిణాయన కాలం(జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా విగ్రహం రంగులు మారడం  వినాయకుని మహిమే అని భక్తులు అంటారు.

3.  దీన్ని మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అంటారు. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా  చిత్రాలు చాలా ఉన్నాయి.
 4.   ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన సంగతే.  కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ. ఇక్కడ  మాత్రం అది చెల్లదు అంటుంది  ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.., ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయట.
 5.  అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉందని అంటున్నారు.  వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో, ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.
6.  వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.. ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి.
7.   అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉందట. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారని చెబుతారు.
8. ఈ ఆలయం 1317 సంవత్సరంలో  నిర్మించారనీ, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉందని చరిత్రకారుల అంచనా.
9.  నిజానికిది శివాలయమట. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు.
10.  ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించారు.
11. ఇక  ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది.