ఇంట్లో గోల్డ్‌ ఫేషియల్‌ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా?

చాలామంది స్థోమత లేక ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటారు. అంతేకాకుండా చాలా మంది సమయం దొరకక బయటకు వెళ్ళి ఫేషియల్స్‌ చేయించుకోలేక బాధపడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ రోజు ఈ అద్బుతమైన, సులభమైన గోల్డ్‌ ఫేషియల్‌ ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి మీరు బంగారు వర్ణం సొంతం చేసుకోవాలంటే కొంత డబ్బు ఖర్చు చేయాల్సివస్తుంది. మీరు ఈ గోల్డ్‌ ఫేషియల్‌కి సంబంధించిన వాటిని కొనుగోలు చేసేటప్పుడు మంచి బ్రాండెడ్‌ వస్తువులనే కొనుగోలు చేయాలి. వీటి ధర 450 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. మీకు నచ్చిన బ్రాండ్ ని మీరు ఎంపిక చేసుకొని వాటిని కొనుగోలు చేయండి. ఏవి పడితే అవి వాడ వద్దు. దానివల్ల మీ చర్మం పాడయిపోతుంది. అందువల్ల మీకు నచ్చిన మీరు నమ్మదగిన ప్రొడక్షన్స్‌ని వాడడం మంచిది. ఈ గోల్డెన్‌ ఫేషియల్‌ ని ఇంట్లో చేసుకోవడం వలన డబ్బు ఆదాతో పాటు బంగారు వర్ణం మీ సొంతం అవుతుంది. ఈ ఫేషయల్‌ కిట్‌ని ఒక్కసారి కొనడం వలన దీనిని 3 నుండి 4 సార్లు ఉపయోగించుకోవచ్చు. ఈ కిట్‌ ధర కేవలం 450 రూపాయలు. అదే సెలూన్‌ కి వెళితే ఒకసారి ఫేషియల్‌ చేయించు కోవడానికి 500 నుండి 700 రూపాయలు మీరు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల ఈ కిట్‌ని కొని వాడుకోవడం ఉత్తమం. కొన్ని సులభమైన పద్దతులను అనుసరించి ఎలా ఈ ఫేషియల్‌ చేసుకోవాలో తెలుసుకుందాం.


గోల్డెన్‌ ఫేషియల్‌ అన్ని రకాల చర్మతత్వం కలవారు వాడవచ్చు. అంటే ఆయిల్‌, డ్రై  మరియు సాధారణ చర్మం కలవారు అందరూ వేసుకోవచ్చు. కాని సున్నితమైన చర్మతత్వం కలవారు మాత్రం ముందుగా చేతిమీద ప్యాచ్‌ పరీక్ష చేసుకుని ఫేషియల్‌ చేసుకోవడం మంచిది.
గోల్డెన్‌ ఫేషియల్‌ కిట్‌లో ఉండేవి

1. గోల్డ్‌  క్లెన్సర్‌

2. గోల్డ్‌ స్క్రబ్‌

3. గోల్డ్‌ క్రీమ్‌

4. గోల్డ్‌ ఫేషియల్‌ జల్‌

5. గోల్డ్‌ ట్రీట్‌మెంట్‌ ప్యాక్‌

గోల్డ్‌ ఫేషియల్‌ చేసుకునే పద్దతి

1. ముందుగా ముఖాన్ని, మెడని శుభ్రంగా కడగాలి. దీని కోసం మీరు సాధారణ క్లెన్సర్‌గా పాలను ఉపయోగించుకోవచ్చు. దూదిని ఈ క్లెన్సర్‌ లో ముంచి ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఇలా 4 నుండి 5 నిమిషాల పాటు మసాజ్‌ చేసుకోవాలి. తరువాత దూదితో  శుభ్రపరచుకోవాలి.

2. శుభ్రపరచిన ముఖాన్ని బాగా తుడుచుకుని ఆవిరి పట్టుకోవాలి. కేవలం ఆవిరి 3  నుండి 4 నిమిషాల పాటు పెట్టాలి.ఇలా ఆవిరి పెట్టుకోవడం వలన చర్మం పై ఏర్పడిన  దుమ్ము, దూళి తొలగిపోతాయి. ముఖం శుభ్రం అవుతుంది. అంతేకాకుండా చర్మం  పొడిబారకుండా కాపాడుతుంది.

3. ఇప్పుడు మీరు కొనుగోలు చేసిన దాంట్లో గోల్డ్‌ క్లెన్సర్‌ ని తీసుకొని దానితో ముఖాన్ని, మెడని శుభ్రం చేసుకోవాలి. ఈ క్లెన్సర్‌ని కొద్దిగా చేతిలోకి తీసుకుని వలయాకారంలో ముఖాన్ని మరియు మెడని 4 నుండి 5 నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి. తరువాత తడి దూదితో లేదా నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.

4. ముఖాన్ని గోల్డ్‌ క్లెన్సర్‌ తో శుభ్రం చేసుకున్న తరువాత ముఖాన్ని, మెడని స్క్రబ్‌ చేసుకోవాలి. కొద్దిగా గోల్డ్‌ స్క్రబ్‌ని చేతిలోకి తీసుకుని ముఖాన్ని మీ వేళ్ళతో వలయాకారంలో 5 నిమిషాలపాటు మసాజ్‌ చేయాలి. కంటి భాగంలో స్క్రబ్‌ చేయకూడదు, కంటికి దూరంగా మీ చేతులను ఉంచాలి. తరువాత సాధారణ నీటితో శుభ్రంగా కడగాలి.

5. ఇప్పుడు మసాజ్‌ చేసుకొనే సమయం వచ్చింది. మీ చేతిలో కొద్దిగా గోల్డ్‌ క్రీమ్‌ని తీసుకుని ముఖానికి, మెడ భాగానికి పూర్తిగా రాయాలి. తరువాత మృదువుగా చేతివేళ్ళతో 8 నుండి 10 నిమిషాలపాటు మసాజ్‌ చేసుకోవాలి.10 నిమిషాలు గడిచిన తరువాత నీళ్ళతో లేదా తడి దూదితో శుభ్రంగా తుడుచుకోవాలి.

6. ఇప్పుడు మీ చర్మాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. అందుకోసం గోల్డ్‌ ఫేషియల్‌ జల్‌ని కొంచెం చేతిలోకి తీసుకుని ముఖానికి, మెడకి రాసుకుని 5 నుండి 6 నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి. మసాజ్‌ పూర్తయిన తరువాత మీ ముఖాన్ని మరియు మెడని నీటితో లేదా దూదితో శుభ్రపరుచుకోవాలి.

7. ఇప్పుడు  చివరి దశకు చేరుకున్నాం శుభ్రపరచిన ముఖానికి తగినంత గోల్డ్‌  ట్రీట్‌మెంట్‌ ప్యాక్‌ని మృదువైన పొరగా వేయాలి. ఈ విధంగా గోల్డ్‌ ప్యాక్‌ ని వేసుకుని 10 నుండి 15 నిమిషాలు ఆరనివ్వాలి. 15 నిమిషాలు గడిచిన తరువాత చేతితో మృదువుగా మసాజ్ చేసుకుంటూ శుభ్రపరుచుకోవాలి. శుభ్రపరచుటకు సాధారణ నీటిని లేదా
చల్లని నీటిని వాడాలి.

0 comments:

Post a Comment